Monday, April 18, 2011

INSPIRE-STORES: చెడు అలవాటు - కోపం




అహ్మద్ చాలా మంచి బాలుడు. అతనికి ఉన్న ఒకే ఒక చెడు అలవాటు - కోపం. కోపం వచ్చినప్పుడు తరతమ భేధం లేకుండా అందరినీ తిట్టడం అతని బలహీనత. ఈ విషయం అహ్మద్ కు కూడా చాలా బాధకలిగిస్తూ ఉండేది. కోపం తగ్గిన తర్వాత చాలా పశ్చాత్తాప పడేవాడు. ఒకరోజున, ఏవిధంగానైనా సరే తన చెడు అలవాటును వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పి, తనలోని కోపాన్ని శాశ్వతంగా వదిలించుకునే మార్గాన్ని చూపపమని వేడుకున్నాడు. తండ్రి కొంచెం సేపు ఆలోచించి, ఇంట్లోనుండి మేకుల డబ్బా, సుత్తి తీసుకున్నాడు. అహ్మద్ ను పెరటి గోడ వద్దకు తీసుకుని వెళ్ళి తనకు ఎప్పుడైతే కోపం వస్తుందో వెంటనే గోడదగ్గరకు పోయి, అందులో ఒకమేకు దించమని ఆజ్ఞాపించినాడు. అహ్మద్ నిజాయితీగా అమలు పరచడం మొదలు పెట్టినాడు. ప్రతిరోజు సాయంత్రం గోడ వద్దకు వచ్చి ఆరోజు గోడలో దించిన మేకులను లెక్కపెట్టుకోవడం అహ్మద్ దినచర్యలో ఒకభాగమైపోయినది. కోపం వలన కలిగే బాధకంటే మేకులు దించే బాధ అతనికి ఎక్కువగా అనిపించేది. రోజురోజుకు మేకుల సంఖ్యతగ్గడం అతనికి సంతోషాన్ని కలిగించేది. కొంతకాలం తర్వాత అహ్మద్ ఒక్కమేకు కూడా గోడలో దించని రోజు వచ్చినది. కొన్నాళ్ళు ఓపికపట్టి, మేకులు దించవలసిన అవసరం రావటం లేదనే విషయాన్ని అంటే తనలోని కోపము పూర్తిగా తగ్గిపోయిందనే విషయాన్ని నిర్ధారించుకుని, ఆ మేకుల డబ్బాను తన తండ్రికి తిరిగి ఇచ్చివేసేను.

కాని కొన్నాళ్ల తర్వాత అహ్మద్ మరల తనకు కోపం రావటం గమనించాడు. ఈ సంగతి తెలిసిన తండ్రి అహ్మద్ నుగోడ వద్దకు తీసుకుని పోయి, ఇప్పటివరకు గోడలో దించిన మేకుల్ని చూపించి, కోపం వచ్చినప్పుడల్లా ఒక్కో మేకును పీకమని ఆజ్ఞాపించెను. క్షణికావేశానికి లోనవ్వటం వలన కలిగే కష్టం కంటే మేకులు పీకటం చాలా కష్టమైనదని త్వరలోనే గ్రహించి, తన కోపాన్ని శాశ్వతంగా వదిలివేశాడు. తండ్రి అతడిని మరల గోడ వద్దకు తీసుకుని వచ్చి ఆ మేకులు లాగటం వలన ఏర్పడిన రంధ్రములను చూపించి ఇలా చెప్పెను - నీవు కోపం లో దూషించినప్పుడు ఇతరుల హృదయములలో ఏర్పడినవే ఈ రంధ్రములు. నీ కోపాన్నైతే వదిలించుకోగలిగావు గానీ, ఈ రంధ్రములను పూడ్చలేవు కదా. కాబట్టి ఇకనుండి ఎవరినీ కష్టపెట్టకుండా అందరికీ సహాయపడుతూ జీవించు. నాలుక నుండి వెలువడిన మాట వెనక్కి తీసుకోవటం అసాధ్యమనే విషయం ఎల్లప్పుడూ గర్తుంచుకోవాలి. నాలుక నుండి వెలువడే మంచి మాటలు గౌరవాన్ని సంపాదించి పెడితే, చెడు మాటలు పాపాత్ముడిగా, దుర్మార్గుడిగా మారుస్తాయి.

Search This Blog