Wednesday, April 6, 2011

నా అత్తారూరు



  • హాస్యం కథ




  • నా అత్తారూరు




  • - కూచిమంచి శ్రీనివాస శింగరాజు




  • ఆకాశంలో సూర్యారావు వెళ్లిపోయి చంద్రారావు వచ్చేశాడు.




  • సాయంత్రం కుర్చీలో కూర్చుని నాకు నేనే కితకితలు పెట్టుకుని నవ్వుకుంటున్నా. ఎందుకంటే నేను నవ్వుకొని రెండు సంవత్సరాలైంది. కారణం నాకు పెళ్లయ్యి రెండు సంవత్సరాలైంది.




  • కమ్మని పప్పన్నం తింటుంటే పంటి కింద రాయి వచ్చినట్టు అంత మంచి మూడ్‌లో 'బాబోయ్‌ బాబోయ్‌' అంటూ నా సెల్‌ అరిచింది. ఎత్తాను. అటువైపు నుంచి అజీర్ణంతో బాధపడుతున్న గాడిద అరిచినట్లు మా మావయ్య 'ఏవయ్యా అల్లుడూ. పండగకి రమ్మంటే రాను అని అమ్మాయిని ఒక్కదాన్నే పంపావు. వచ్చావంటే నీకు ఇవ్వాల్సిన కట్నం బాకీ ఇచ్చేస్తా' అని పెట్టేశాడు.




  • అన్నట్లు నా పేరు శీను. నా వృత్తి ఉత్తి డాక్టరే. నాకు మా అత్తగారి కొంప మాట ఎత్తితే రొంప పట్టినంత చిరాకు. పెళ్లయిన మొదటి సంవత్సరం మా తాతగారి ప్రాణాలు భూమి మీద నుంచి స్వర్గానికి ట్రాన్స్‌ఫర్‌ అవటంతో అత్తారూరు వెళ్లే బాధ తప్పింది. మనలో మన మాట వైద్యం చేసింది నేనే. ఈ సంవత్సరం మా మామకి బాగోలేదు. నేను వైద్యం చేస్తానన్నా ఎవరూ ఒప్పుకోలేదు. కోపమొచ్చి మా ఆవిడను ఒక్కదాన్నే పంపాను. ఇప్పుడు మా మావయ్య అన్న చివరి మాటలు గుర్తుకు వచ్చి కట్నం మీద ప్రేమతో బయలుదేరా.




  • బయలుదేరే ముందు ఎవడో తుమ్మాడు. ఆగాను. ఏంటి సార్‌ సెంటిమెంటా అన్నాడు. సెంటిమెంటా ఆయింట్‌మెంటా అలాంటివేమీ లేవు అన్నా. వాడి తుమ్ము ప్రభావమో ఏమో మా చంటిగాడు అదేలెండి నా స్కూటర్‌ వెనక కాల్లో ఏదో గుచ్చుకుంది. పాపం చాలా రక్తం పోయింది. గబగబా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లి 'మా వాడి పరిస్థితి ఏమిటి' అన్నా.




  • 'పేషెంట్‌ కండీషన్‌ చాలా సీరియస్‌గా ఉంది. ఇరవై నాలుగు గంటలు దాటితేకానీ ఏమీ చెప్పలేము' అన్నారు.




  • 'ఎంత డబ్బయినా పర్వాలేదు మీరు చేయవలసింది చేయండి' అని వచ్చేశా.




  • వెంటనే ఆటోని ఆపి 'ఎక్కడికెళ్తుంది' అన్నా.




  • 'ఎక్కడికైనా వెళ్తుంది' అన్నాడు.




  • ఎక్కి బస్టాండ్‌కి పోనివ్వమన్నా. పది నిమిషాలలో దింపాడు.




  • 'ఎంత' అన్నాను.




  • 'ఎంతో మీకు తెలియదా?' అన్నాడు.




  • ఇరవై కాగితం చేతిలో పెట్టి చేయి సాచాను. వాడూ నాలాగే చేయి సాచాడు యింకో ఐదు యివ్వమని. నేను తెలివిగా 'నాదీ ఆటోనే. నేనెప్పుడూ ఇరవయ్యే పుచ్చుకుంటా' అన్నా. 'అయితే మా యూనియన్‌ లీడర్‌తో చెపుతానుండు' అన్నాడు.




  • వీడితో గొడవ ఎందుకని ఇచ్చేశా.




  • ఆ గొడవ వల్లో ఏమో నేను ఎక్కాల్సిన బస్సు వెనక చక్రాలు ముందుకు పోతూ కనిపించాయి. పెరుగన్నంలో నెయ్యి, నూనె వేసుకొని తిన్నంత చిరాకుగా అనిపించింది. నాకు చిరాకు వచ్చినా, ఏమీ తోచకపోయినా ఏదో ఒకటి తినడం అలవాటు. చెర్రీ పళ్లు పావుకిలో కొనుక్కుని తింటుంటే ఓ ముష్టివాడు 'ఆ పళ్లు బాగుంటాయా' అన్నాడు. కనీసం 'సార్‌' అని కూడా అనలేదు. అందుకే 'చాలా చెత్తగా ఉంటాయి' అన్నా. 'అలాంటప్పుడు తినటం ఎందుకు?' అన్నాడు.




  • చిరాకుగా నాలుగంటే నాలుగు పళ్లు పెట్టాను.




  • తర్వాత ఆ ముష్టివాడు అరకిలో పళ్లు కొని 'ఇందాక టేస్ట్‌ కోసం సేంపిల్‌గా అడిగా' అని నాకు ఎనిమిది పళ్లు ఇచ్చాడు. సిగ్గుపడకుండా తీసేసుకున్నా.




  • అంతలో నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. అందరూ నాలాగే అత్తవారి ఇళ్లకేమో గుంపుగా పోటీ పడుతున్నారు. నాకు కిటికీ పక్క సీటు అంటే యిష్టం. లోపల ఉన్న వాడికి నా రుమాలు యిచ్చి కిటికీ పక్క సీటులో వెయ్యమన్నాను.




  • ఎలాగో లోపలికి ఎక్కి 'నా రుమాలు' అన్నాను.




  • వాడు వేలు చూపాడు. నా రుమాలు డ్రైవర్‌ సీట్లో ఉంది.




  • నాకు ఎక్కడో కాలింది.




  • 'కిటికీ పక్క సీటు కావాలన్నావుగా' అన్నాడు వాడు.




  • ఒక కుర్రాడు 'అంకుల్‌ కూర్చోండి' అన్నాడు తన పక్కన సీటు చూపిస్తూ.




  • పెళ్లయ్యి రెండు సంవత్సరాలు కూడా కాని నన్ను అంకుల్‌ అనేసరికి ఇందాక కాలిన చోటే మళ్లీ కాలింది. కానీ చోటు ఇచ్చాడని ఏమీ అనలేదు. మాటల్లో వాడితో డాక్టర్‌నని చెప్పానంతే. ఊరకనే వస్తే ఏదైనా చేసే మనిషిలా ఉన్నాడు. వెంటనే వాళ్ల తాతకి, మామకి, అమ్మకి ఉన్న అన్ని రోగాలు చెప్పి ఏం చేయాలి అన్నాడు.




  • చివరిగా 'అంకుల్‌ నాకు కాలు బాగా వాచింది. వాపు తగ్గాలంటే ఏమి చేయాలి?' అన్నాడు.




  • 'బస్సు చక్రం కింద పెట్టు' అన్నాను.




  • వాడు కోపంగా 'మీ దగ్గరికి వచ్చే పేషెంట్లతో ఇలాగే మాట్లాడతారా' అన్నాడు.




  • 'డబ్బులివ్వని వారితో యిలాగే మాట్లాడతాను' అన్నాను.




  • వాడి దిగి వెళ్లిపోయాడు.




  • ఏదో ఆలోచిస్తూ అటువైపు జరగడానికి కొంచెం ప్రయత్నించా. కానీ వెంటనే యిటువైపుకు జరగాల్సి వచ్చింది. ఏమిటా అని చూస్తే నా పక్క సీట్లో 'తల ఒకటే కానీ శరీరాలు రెండు' లాంటి మనిషి ఒకడు కూర్చోని ఉన్నాడు.




  • 'ఏడకి పోవాల అన్నా' అన్నాడు.




  • 'నీకు నేను అన్ననట్రా దున్నా' అందామనుకున్నా.




  • కానీ నాకు గొడవలు యిష్టం ఉండవు. కాసేపు పడుకునేసరికి నా గుండె నెవరో నొక్కేస్తున్నట్లు అనిపించింది. తీరా చూస్తే ఆ పెద్ద శరీరం, ఈ పేద శరీరంపై సేద తీరుతోంది. ఆ క్షణమున ఆ శరీరం నుంచి వెలువడు చెమట వంటి సుగంధ పరిమళాలు అన్నియూ నాకే సొంతం. కాసేపటికి తోక, తొండం లేని ఆ ఏనుగు లేచి దిగిపోతోంది. అమ్మయ్య అనుకొని కిటికి చివరకు జరిగాను. వాడు కిటికి దగ్గరకు వచ్చి 'ఇదే లాస్ట్‌ స్టాప్‌ దిగవా' అన్నాడు. అమ్మయ్య అని అనుకున్నంతసేపు కూడా లేదని బాధపడి దిగుతుంటే కండక్టర్‌ నాకేసి చూసి తింగరి నవ్వులు నవ్వుతున్నాడు. నేను కూడా మహాబాగా నవ్వాను.




  • బస్సు దిగాక వాడి తింగరి నవ్వులకి అర్థం తెలిసింది. వాడి దగ్గర నావి అయిదు రూపాయలు ఉండిపోయాయి.




  • అక్కడ నుంచి నా అత్తవారింటికి దూరం అయిదు కిలోమీటర్లు. ఆటోకు డబ్బులు దండగ ఎందుకని నడక మొదలు పెట్టా. రెండు కిలోమీటర్లు నడిచేసరికి కాళ్లు కదలనన్నాయి. మూడు కిలోమీటర్లు ముందుకు నడవాలా? రెండు కిలోమీటర్లు బండి మీద వెనక్కి వెళ్లాలా అనుకొని వెనక్కే వచ్చి ఆటోల దగ్గర పడ్డాను.




  • అక్కడ రెండు ఆటోలు ఉన్నాయి. మొదటి వాడిని అడిగితే పదిహేను రూపాయలు అన్నాడు. రెండవవాణ్ణి అడిగితే ఇరవై అన్నాడు. మరలా మొదటి వాడి దగ్గరికే వచ్చా. అంతలో రెండోవాడు వెళ్లిపోయాడు. మొదటి వాడు 'ఆడెంత అడిగాడు' అన్నాడు. ఇరవై అన్నాను. అయితే నాకూ యిరవయ్యే అన్నాడు.




  • 'ఇరవై కాకపోతే ఇరవై అయిదు తీస్కో' అన్నా వెధవ ముఖం వేసుకొని.




  • 'అయితే ఎక్కండి' అన్నాడు.




  • అన్నట్లు మా వాళ్లని మీకు పరిచయం చేయలేదు కదూ.




  • నా భార్య పేరు మౌనిక. పేరుకు, ప్రవర్తనకు చాలా తేడా ఉంది. నా స్నేహితుడి పెళ్లిలో చూసి సగం మనసు పారేసుకున్నా. ఎవడో ఏదో కామెంట్‌ చేస్తే వాడికి క్లాసు పీకింది. వెధవకి కళ్ల వెంబడి నీరు వచ్చింది. నిజంగా వాడికి బతుకు మీద చిరాకు పుట్టేలా మాట్లాడింది. అది చూసి నేను అమె చాలా ధైర్యవంతురాలని అమ్మానాన్నలతో గొడవపడి మరీ చేస్కొన్నాను.




  • తర్వాత తెలిసింది కొరివితో తలగోక్కున్నానని. ఆరోజు వాడికి గంట పీకిన క్లాసు నాకు యిరవై నాలుగు గంటలూ పీకుతుంది. అలాగని చెడ్డది కాదు. నన్ను తప్ప అందర్నీ గౌరవిస్తుంది. అందరి భార్యల్లా నలుగురిలోనూ తిట్టదు. నాలుగు గోడల మధ్య తిడుతుంది.




  • ఇకపోతే మా అత్తగారు నలుగురిలోనూ చెప్పకూడని విషయాలు నలభై మందిలో చెబుతుంది. పెళ్లిలో బట్టలు పెడుతుంటే సరదాకి 'డ్రాయర్‌ ఏదీ' అన్నా. 'నీకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదట కదా' అంది. అందరూ తెగ నవ్వారు. సరదాగా అంటుందో లేక అనాలని అంటుందో తెలియదు.




  • ఇకపోతే మా మావయ్య మహా పిసినారి. పెళ్లిలో నేను నా బావమరిదికి పెట్టిన బట్టలు తిరిగి పండక్కి నాకే పెట్టాడు. ఏమన్నా అందామంటే పెద్దవాడు. పైగా పెళ్లయిపోయింది. కట్నం సగం అక్కడ చిక్కుకుపోయింది. అన్నీ అనేసి క్షమించు అంటాడు.




  • అన్నట్లు మీకు అసలైన వ్యక్తి మా 'బబా' గురించి చెప్పలేదు కదూ. 'బబా' అంటే 'బకాసుర బావమరిది'. వీడికి భారతదేశం రాజధాని తెలియదు కాని మైసూరుపాకం వాసన చూసి ఏది తక్కువైందో చెప్పగలడు.




  • పెళ్లయిన కొత్తలో వచ్చాడు.




  • 'ఎక్కడికెళదాం' అంటే సిగ్గులేకుండా 'కేంటిన్‌కి' అనేవాడు. కేజీ స్వీట్స్‌ కోసం పెళ్లాన్ని, పిల్లల్ని అమ్మే రకం.




  • ఒకరోజు టివి చూస్తుంటే 'ఏవండీ భోజనం తినేస్తారా? మా తమ్ముడు తిన్నాక తింటారా' అంది. వాడు తిన్నాక తింటే తినడానికి గిన్నెలే ఉంటాయని భయపడి పరుగుతీశాను.




  • ఆటో యిల్లు చేరుకుంది. ఇరవై ఇచ్చి వచ్చేస్తుంటే చేయి పట్టుకున్నాడు. లోపల బాధ పడుతున్నా పైకి నవ్వుతూ అయిదు యిచ్చేశా. లోపలికి వెళ్లి కాళ్లు కడుక్కుంటుంటే మా మావయ్య 'అల్లుడూ ఎప్పుడు వెళ్లిపోతావ్‌' అన్నాడు. బలవంతంగా ఓ కృత్రిమ నవ్వు నవ్వా. మళ్లీ అదే అన్నాడు.




  • 'ఏం లేదు అల్లుడూ నువ్వు ఎన్ని రోజులు ఉంటావో చెపితే దాన్ని బట్టి నీకు ఎప్పుడు ఏం చేయాలో అత్తకి చెపుదామని' అన్నాడు.




  • కోపంగా చూశాను.




  • అలవాటు కదా. 'క్షమించు' అన్నాడు.




  • అంతలో మా అత్తగారు 'ఏంటి అల్లుడూ ఈ టైంలో వచ్చావు. భోజనం చేసే వచ్చి ఉంటావు వెళ్లి పడుకో' అంది.




  • మా ఆవిడ నిద్రకళ్లతో వచ్చి 'ఏవండీ ఎంత సేపయింది వచ్చి' అంది.




  • 'వచ్చేముందు వస్తున్నా అని చెప్పవచ్చు కదా. మీరు రేపు వస్తారని అన్నం మా నలుగురికే వండానండీ' అంది.




  • 'ఏం పరవాలేదు మీ తమ్ముడిని పెరుగన్నం తినడం మానివేయమను. నేను కడుపు నిండా భోజనం చేస్తా' అన్నాను.




  • 'అక్కా నేను భోజనం చేసేశా' అంటూ వాడు వచ్చాడు.




  • వస్తూనే 'బావగారూ' అంటూ చేతిలో సంచి తీసుకున్నాడు. వెర్రివెధవని. అదంతా అభిమానమే అనుకున్నా. సంచి విప్పి బట్టలు గెలికేస్తూ 'తినడానికి ఏమీ తేలేదా బావగారూ' అన్నాడు.




  • 'నన్ను తిను' అన్నా.




  • 'ఈ వేళ శనివారం' అన్నాడు.




  • మా ఆవిడ 'మీరు ఒక్కరూ అరుగు మీద పడుకుంటారా? లేక మా తమ్ముడి పక్కలో మంచం మీద పడుకుంటారా' అంది.




  • వాడి పక్కన పడుకుంటే అర్ధరాత్రి ఆకలి వేస్తే ఏ చెవో, ముక్కో తినేస్తాడని భయం వేసి అరుగు మీదే పడుకుంటా అన్నాను.




  • చిరంజీవి వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో నేను వచ్చానని తెలుసుకొని దోమలు, ఈగలు, బస్సుల మీద లారీల మీద వచ్చాయి. అవి తెల్లవార్లూ నాకు ఒకటే ముద్దులు. దుప్పటి లాగి మరీ పెట్టాయి.




  • తెల్లవారింది. నా పనులు నేనే చేస్కొన్నాను.




  • తర్వాత ధైర్యంగా మామగారి దగ్గరికెళ్లి 'నాకు యివ్వాల్సిన కట్నం' అన్నాను.




  • 'ఇప్పుడెందుకు' అన్నాడు.




  • 'కొత్తబండి కొనుక్కుందామని' అన్నాను.




  • 'నా బండి పట్టుకెళ్తావా' అన్నాడు.




  • బండికేసి చూస్తే మూలశంక ఉన్న ముష్టివాడిలా ఉంది.




  • 'మావయ్యా నేను మనుషుల డాక్టర్‌ని. బైక్‌లకి కాదు' అన్నాను.




  • దారంట ఒకడు పోతుంటే 'సుబ్బారావ్‌ నీ కూతురు అదృష్టవంతురాలు. మంచి అల్లుడు దొరికాడు నీకు' అన్నాడు మావయ్య.




  • గోల ఎందుకని 'పోనీ యివ్వాల్సిన కట్నం ఎప్పుడిస్తావ్‌' అన్నాను.




  • 'నీకు కూతురుగానీ, కొడుకుగానీ పుట్టినప్పుడు'




  • 'అప్పుడూ యివ్వకపోతే'




  • 'అన్నప్రాసనకి యిస్తా'




  • 'తప్పక యిస్తావా'




  • 'కుదిరితే యిస్తా లేకపోతే నీ పిల్ల అక్షరాభ్యాసానికి యిస్తా'




  • ఇంతలో నా సెల్‌ 'బాబోయ్‌ బాబోయ్‌' అని అరిచింది. ఎక్కడో మలేరియా అంట త్వరగా రావాలని. కట్నం ఎలాగూ రాదు వెళ్లకపోతే ఉద్యోగం పోతుంది అనుకున్నా.




  • అంతలో రాత్రి కనిపించిన ఆటోవాడు 'వచ్చేస్తారా' అన్నాడు.




  • ఎక్కేశాను.




  • అలవాటుగా మావయ్య 'క్షమించు' అన్నాడు.




  • మెత్తటి పేగు




  • - పృధ్వి




  • పొద్దున్నే లేచి చూస్తే మా మామ పేపరు చూస్తూ కనిపించాడు. ఈయన ఇంత శ్రద్ధతో పేపరు చదువుతున్నాడేమబ్బా? అని ఆశ్చర్యపోయాను.




  • సాధారణంగా ఆయన రెండు విషయాల కోసం పేపరు చదువుతుంటాడు. ఒకటి నక్సలైట్ల వార్తలు, రెండు డి.ఎ వార్తలు. గత రెండు మూడు రోజులుగా నక్సలైట్ల వార్తలు అంతగా రావడం లేదు. అంటే డి.ఎ ఏదో పెరిగిందన్న మాట.




  • మా మామ రిటైర్మెంటు అయిన కాణ్ణుంచి పెన్షన్‌ డబ్బుతో అతి పొదుపుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆదరించే వాళ్లెవరూ లేకపోతే తమ జీతానికీ పెరిగే డి.ఎకూ రిటైరైన వాళ్ళు ఎంతగా అతుక్కుపోతారో చూస్తేగాని తెలియదు.




  • 'ఏంది తాతా? మల్ల డి.ఎ పెరిగిందా ఏం?' అంటూ మా పిల్లలు తాత చుట్టూ మూగారు.




  • 'ఔనోయ్‌. మాకు ఈ నెల డి.ఎ పెరిగింది' అన్నాడు కాసింత నవ్వుతో.




  • 'అయితే మాకు స్వీటు యిప్పియ్యాలె. మమ్మల్ని సినిమాకు తీస్కపోవాలె' అంటూ డిమాండ్ల లిస్టు ముందు పెట్టారు.




  • 'సరే.. సరే' అంటూ ముభావంగా అని తిరిగి పేపర్లో మునిగిపోయాడు.




  • 'అదేంది తాతా.. డి.ఎ పెరిగితే ఎవరైనా సంతోషిస్తారుగాని నువ్వేంది గట్లున్నావు?' అంటూ మా చిన్నమ్మాయి సాగదీసి చేతిలోని పేపరు గుంజేసి సంగతి చెప్పమన్నట్టు దబాయించేసింది.




  • 'ఆ.. ఏం లేదు. నాకు ఇంక్రిమెంటు కట్‌గాకుంటే నా డి.ఎ మరింత పెరుగుతుండె గదా అని ఆలోచిస్తున్నా. గదేందోగాని డి.ఎ పెరిగినప్పుడల్లా కట్‌ అయిన ఇంక్రిమెంటు యాదికొచ్చి ఒక దిక్కు సంతోషమనిపిస్తే ఒక దిక్కు దుఃఖమనిపిస్తది' అన్నాడు నిట్టూరుస్తూ.




  • 'ఏందీ.. నీకు యింక్రిమెంట్‌ కట్‌ చేసిన్రా? ఎందుకూ? ఏం జరిగింది?' అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టారు.




  • 'నా ఇంక్రిమెంట్‌ కట్‌ గావడం వెనక ఓ పెద్ద కథ ఉందోయ్‌'




  • 'తాతా.. తాతా.. ఆ కథ ఏందో జర చెప్పవూ'




  • 'చెబుతానుగాని నాకో టీ కావాలి'




  • 'సరే'




  • 'అవి నేను అదిలాబాద్‌ జిల్లాలో రిజర్వు సబ్‌ ఇన్‌స్పెక్టరుగా పని చేస్తున్న రోజులు. అక్కడ యాంటీ నక్సలైట్‌ స్క్వాడ్‌ కు లీడర్‌గా పనిచేసేవాడిని'




  • 'అంటే ఏంది తాతా'




  • 'ఆ.. ఏం లేదు. నక్సలైట్లను పట్టుకోవాలన్నమాట. నా కింద ఓ ఇరవై మంది పోలీసులుండేవాల్లు. వాల్లందరినీ తీసుకొని పల్లె పల్లె చెట్టూ గుట్టా తిరిగి నక్సలైట్ల వేట సాగించెటోల్లం.




  • గా రోజులల్ల గీ నక్సలైట్లని పొరకల దొరలని పిల్చెటోల్లు. వాల్లంటే గీ గోండు బడ్పలకి శానా యిష్టం. గాపొరకల దొరల్ని కండ్లల్ల వెట్టుకొని పానం లాగా జూసుకునేటోల్లు. గందుకే, మేం వాళ్లను పట్టుకోనీకెవోతే, ఆల్లు యింకో దిక్కుకు సునాయాసంగా జారుకునేటోల్లు. గీ గోండులు ఆల్లకు ఫుల్‌సపోర్టు అని చెప్పినగదా. దొంగనాకొడుకులు అన్నల గురించి అడిగితే 'అసలు మాకేం తెల్వదు. అట్లాంటోల్లను మా జన్మల చూళ్లేదు' అన్నట్లు పోజులు పెట్టేవాల్లు. గీ గోండు కొడ్కుల మెదడు మోకాల్లల్ల ఉంటదని నవ్వుకునేటోల్లంగాని ఈల్లు భలే చాలూగాళ్లు. ఇంటి ముందర మాకు అన్నం బెడ్తరు. ఇంటెన్క ఆల్లకన్నం బెడ్తరు. కోడల్ని కొల్చుకోమంటరు. అత్తను లెక్కజూడమంటరు.'




  • 'మరి అన్నలు కనబడితే ఏం జేసెటోల్లు తాతా?'




  • 'ఏందీ చేసుడు? వాల్లు ఆ పక్క నుంచి వొస్తే మేం ఈ పక్క నుంచి పోయెటోల్లం. అయినా యిప్పటిరోజులుగావులే. యింతటి పగ, ద్వేషం, ఈ రక్తపాతం అంత ఉండేది గాదు. నక్సలైట్లను కోర్టుకు తీస్కపోతే నేనే స్వయంగా టిఫిన్‌ పెట్టిం చెటోన్ని. ఎవరికీ తెల్వకుండ డబ్బులిచ్చెటోన్ని. 'ఎందుకు గీ తిప్పల వడ్తరు. మందిల గల్వరాదున్రి' అంటే 'సార్‌. మేమున్నది మందిలనే' అంటూ నవ్వుకుంట జవాబిచ్చెటోల్లు'




  • 'మొత్తం మీద పై ఆఫీసర్లకు వాల్లంటే కోపంగా ఉన్నా కిందోల్లకు అంత ఉండేదిగాదు. ఒక్కోసారి ఆల్లంటే జాలికూడా కలిగేది.'




  • 'సరిగ్గా ఆ సమయంల ఓ కొత్త ఎస్‌పి వొచ్చిండు. ఆయన దొరల వంశం నుంచి వొచ్చిం డట. ఎప్పుడూ ఫటఫటలాడే కొత్తనోటులాగా ఉండేవోడు. వొచ్చీరావడంతో కొత్త కొత్త ఆర్డర్లిచ్చి దడదడలాడించిండు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు స్ట్రిక్టుగ ఇన్‌స్ట్రక్షన్లు వొచ్చినయి. వెంట వెంట ఫటఫటమని ఓ ఇరవైమందిని ఎన్‌కౌంటర్‌ జేసిన్రు. 'ఐ వాంట్‌ ఎన్‌కౌంటర్స్‌. ఏం జేస్తున్రు మీరంతా. భుజం మీద ఆ స్టార్స్‌ ఎందుకు?' అంటూ బండబూతులు తిట్టేవాడు.'




  • 'ఓ రోజున చాలా రహస్యంగా అన్ని పోలీస్‌స్టేషన్లకీ ఓ సంకేతం వొచ్చింది. నక్సలైట్ల అడ్డాలుగ నిల్చిన గూడేలను తగలబెట్టమని దాని సారాంశం. ఇదేదో పోలీసులు తీసుకున్న నిర్ణయమనుకునేరు. దీనికి ప్రభుత్వం సిగ్నెల్‌ కూడా ఉంది. మీకు తెలుసా? ఒక కలెక్టరు కూడా సిఎంతో డైరెక్టుగా మాట్లాడలేడు. అదే ఒక ఎస్‌పి అయితే డైరెక్టుగా మాట్లాడగల్గుతారు.'




  • 'పోలీసులకీ ప్రభుత్వానికీ మధ్య ఉన్నది ఫెవికాల్‌ సంబంధమన్నమాట' మా చిన్నమ్మాయి నవ్వింది.




  • 'అంతేమరి. మీకు కొన్ని విషయాలు చెప్పకూడదు. మీరు వినకూడదు. సంకేతం అందిన వెంబడే అడివికి దగ్గరగా ఉన్న అన్ని స్టేషన్లు అలర్టు అయినాయి. ఎవడూ సిక్‌లీవ్‌ పెట్టొద్దు. చెయ్యాలా, వొద్దా అని ఆలోచించే టైమ్‌ లేదు. పై నుంచి వొచ్చిన ఆర్డరు చచ్చినట్టు ఫాలో కావాల్సిందే.'




  • 'అదేంది తాతా. ఎవరో తప్పు జేస్తే మొత్తం గూడేన్ని కాలబెట్టడమేంది? ముక్కు మీద ఈగ




  • వాలితే ముఖం చెక్కేసుకుంటామా?'




  • 'గీసంగతి ఆల్లతో ఎవడు చెప్పాలె. అసలు కిందోల్లు చెబితే పైవోల్లు ఎప్పుడన్నా యిన్నరా? ఆల్లు చెబితే ఈల్లు ఇనుడే గదా. ఆల్లు ఏసి రూములల్ల గూసోని ఆర్డరిస్తరు. మేం కిందోల్లం ఫాలోగావాలె. గంతే'




  • 'ఆ తర్వాత'




  • 'ఆ తర్వాత ఇంకేంది? రహస్యంగా లిస్టులు తయారయ్యాయి. ఓ నలభై గూడేలు లిస్టులకెక్కాయి. ఒక్కొక్క ఏరియాకు ఒకరిని ఇన్‌చార్జ్‌ చేసి టార్గెట్‌ పెట్టిన్రు. ఒక్కో ఆఫీసురు ఒక్కో గూడేన్ని తగులబెట్టి సాయంత్రంకల్లా 'ఆపరేషన్‌ వొల్కెనో సక్సెస్‌' అంటూ రిపోర్ట్‌ యివ్వాలి'




  • 'మరి గూడెంల ఉండెటోల్లు యాడికి బోతరు తాతా?'




  • 'ఏట్లకి బోతరు. దుమ్ముల గలుస్తరు. గదంత ఎవడు బట్టించుకుంటడు? మీరు అన్నలకు అన్నం బెట్టిన్రు. మేం గూడేల్ని తగులబెడ్తున్నం. గంతే. కోన్‌ పూచ్‌తా కొల్లాపూర్‌ సంస్థాన్‌. తగులబెట్టినంక తలెజెంబులు దీస్కొని దొర్కిన సోటికి బోయెటోల్లు. బత్కినకాడ్కి బత్కెటోల్లు. అస్సలు ఉద్దేశం వేరే. ఒక్క గూడేన్ని తగులబెడితే తక్కిన వాళ్లెవరూ అన్నల జోలికిపోరని. కనీసం తలువను కూడా తలువొద్దని. మనుషుల్ని టెర్రరైజ్‌ చేస్తే దారికొస్తారని వాళ్ల ఆలోచన'.




  • 'నీకూ ఈ గొప్ప డ్యూటీ పడ్డదా తాతా?' వ్యంగ్యంగా అడిగింది మా చిన్నమ్మాయి.




  • 'ఔనే పిల్లా. అసలు విషయం గదే. నాకు




  • 'దుమ్ముగూడెం' అనే గూడేన్ని తగులబెట్టాలని రాత్రికి రాత్రే సంకేతాలందాయి.




  • ఆ రోజే మా ప్రయాణం. నేను మనిషిలో మనిషిగ లేను. బయల్దేరడానికి వ్యాను సిద్ధంగా ఉంది. స్నానం చేసి దేవుడికి దండం పెడ్తుంటే అంతా వెలితిగ అన్పించింది. ఇంట్లో వాల్లకి ఏమీ చెప్పలె. డ్యూటీ మీద పోతున్నానని చెప్పి బయటపడ్డాం.




  • వ్యాను అడవిదారి పట్టింది. మేం వెళ్లాల్సిన దుమ్ముగూడెం అడివికి బాగా లోపలుంటది. సుమారుగా టౌన్‌ నుంచి నలభై కిలోమీటర్లుంటదేమో. అడవి దట్టమయ్యే కొద్దీ మాలో దడ మొదలయింది. బాటకిరువైపుల ఎత్తయిన చెట్లు సెంట్రీ కాస్తున్న ట్టున్నాయి. అడవి నిశ్శబ్దం పోలీసుల్ని భయపెట్టినట్టు మరెవ్వర్నీ భయపెట్టదు సుమా.'




  • 'మొత్తం మీద మేం గూడెం చేరేకల్లా మధ్యాహ్నం రెండు గంటలయింది. చకచకా పని ముగించుకొని సాయంత్రంకల్లా స్టేషను చేరుకోవాలి. ఆపరేషన్‌ వాల్కెనో సక్సెస్‌ రిపోర్టివ్వాలి. అదే ధ్యాస.




  • మేం అక్కడికి చేరేటప్పటికి పారిపోయిన వాల్లు పారిపోగా మిగిలన జనమంతా గుమిగూడారు. అక్కడింత, అక్కడింత చేరి మా వైపు వింతగా, ప్రశ్నార్థకంగా చూస్తున్నారు.




  • వాళ్లంతా ఒకవైపు. మేమంతా ఒకవైపు. వాల్లు ఒక సైన్యం. మేము ఒక సైన్యం. మధ్యన ఎవరో బర్రెగీత గీసినట్లుంది.




  • ఎవని ముఖంల చటాకు మాంసమైతే లేదు. ఒంటి మీద చీకిపోయిన బట్టలు. ఎన్నో ఏండ్లుగ అన్నిటికీ కరువొచ్చినోల్లలాగా ఉన్నరు. ఆల్లు బాధల కోసమే పుట్టినట్టున్నరు.




  • అందర్నీ గుంపుజేసి సంగతి జెప్పిన.




  • 'మీరంతా యిండ్లు ఖాళీ చెయ్యాలె'




  • 'ఎందుకు సార్‌'




  • 'ప్రశ్నలడగొద్దు. పై నుంచి ఆర్డరుంది'




  • 'మరి మేం యాడికి పోవాలె సారు'




  • 'మాకు దెల్వదు. మీరు అన్నలకు సపోర్టు ఇస్తున్నరని మా దగ్గర రిపోర్టు ఉంది. మర్యాదగ ఖాళీ చేయకపోతే మేమే ఖాళీ చేస్తం. మేం మీ గూడెన్ని తగలబెడ్తున్నం'




  • 'అయ్యో సార్‌. మా గూడేన్ని తగలబెడ్తున్నరా? మేమెట్లా బతకాలె. మేమేం జెయ్యాలె' అంటూ కొట్టుకోల్లు, మొత్తుకోల్లు.




  • 'మీరు మర్యాదగా ఖాళీ చెయ్యకపోతే మిమ్ముల గూడ అందుల ఏసి తగులవెడ్తం. మాట్లాడకుండ పని మొదలువెట్టుండ్రి'




  • అట్లంటున్ననేగాని నిజానికి లోపల కెల్కుతున్నది. పసిపోరలు ముసలోల్లు మా వైపు అర్థంగానట్లు జూస్తున్నరు'.




  • ఈ లోపున ఓపెద్ద మనిషి ధైర్యం చేసి ముందుకొచ్చి, చెమట తుడుచుకున్నడు.




  • 'సార్‌. మీరు పెద్దోళ్లు. మీరు జెప్పినట్టు మేం ఇనాలె. కాని, మా మాట కూడా కొంచెం ఇనాలె'




  • 'చెప్పు'




  • 'సార్‌. నా బిడ్డ ఇంట్ల పురుటినొప్పులు వడ్తున్నది. ఇప్పటికిప్పుడు కాళీ చెయ్యమంటే మేం ఏం చెయ్యాలో మీరె జెప్పున్రి'




  • 'నిజంగానే నీ బిడ్డ నొప్పులు వడ్తున్నదా?' అనుమానంగా చూశాను.




  • 'నా బిడ్డ మీద ఒట్టు. కావలిస్తే మీరే వొచ్చి చూడున్రి' అంటూ స్థిరంగా బలంగా నా ముందు నిలబడ్డాడు.




  • నా సైగ చూసి నల్గురు కానిస్టేబుళ్లు గూడెంలకు వెళ్లి చూశారు. అతను చెబుతున్నది నిజమని తెల్సిపోయింది.




  • మెల్లమెల్లగా అవతలివైపు గొంతుబలం పెరిగింది.




  • 'ఆడపిల్ల నొప్పలు పడ్తుంటే ఇండ్లు ఖాళీ చేయమంటరా? ఏం మీకు మాత్రం పిల్లల్లేరా? బిడ్డల్ని గన్నరా? గడ్డల్ని గన్నరా?' అం టూ నిరసనలు మొదలయ్యాయి.




  • నాకేం చేయాలో తోచని స్థితి.




  • ఓ గూడెం పిల్ల కోసం నా పనిని వాయిదా వేసుకోవాలా?




  • ఎందుకయినా మంచిదని నేనే స్వయంగా బయల్దేరిన. రోడ్డుకు అడ్డంగా ఉన్న కాలువల్ని జాగ్రత్తగా దాటుకుంటూ ఆ ఇల్లు చేరుకున్న. అదొక గుడిసెగాని గుడిసె. ఇంటి ముందర ఆడోల్లంతా గుంపు గూడి ఉన్నరు. లోపల్నుంచి కేకలు 'అమ్మో.. నాయనో.. నేను చచ్చిపోతున్నానే.. నాకు శాతగావడం లేదే.. అత్తా.. నన్ను పట్టుకోవే'. ఇంకా కాన్పు కాలేదు.




  • నేను పోలీసును. వాల్లు గోండులు. నాకు వాల్ల బాధల్తో ఏం పని? ఇట్ల పట్టించుకుంటే పోలీసు నౌకిరీ చెయ్యగలమా? అని ఒకవైపు.. నేను పోలీసును గాకముందు మనిషిని గదా. మనిషిని మనిషి పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నాకూ ఇద్దరాడపిల్లలున్నారు గదా అని ఒకవైపు.




  • కాసేపు తటపటాయించి గుడిసె లోపలికి వోయిన. పోలీసుగ కాదు. ఒక మనిషిగ.




  • లోపల అమ్మాయికి బట్టలు సర్దిపెట్టారు. నొప్పులతో బాధపడ్తూనే నన్ను చూసినెంబడే రెండు చేతులు వెట్టి దండమెట్టింది. చెమటతో శరీరం తడిసిపోయిందేమో కన్నీళ్లు గూడా అందులో కలగల్సిపోయాయి. మొత్తం కాన్పు బాధ అంతా ఆ రెండు కళ్లలో కన్పించింది.




  • 'నాకు చనిపోయిన నా మొదటి బిడ్డ ఈదమ్మ యాదికొచ్చింది. దానికి సరైన వైద్య సదుపాయం లేక కాన్పు కష్టమయి కాలం జేసింది' అని కండ్ల నీళ్లొత్తుకున్నాడు.




  • వాతావరణమంతా నిశ్శబ్దమైపోయింది.




  • 'ఎందుకోగాని గుడిసె బయటికొచ్చినాంక ఆ పిల్ల ముఖమే నన్ను వెంటాడింది. నేను తల్చుకుంటే గంటసేపట్లోగూడం బూడిదయ్యేది. కాని ఒక మెత్తటిపేగు ఏదో అడ్డం బడింది.




  • నేను పోలీసునని మర్చిపోయిన. ఒక తండ్రిగ ఆలోచించిన. నా బిడ్డలకేమన్న అయితే నేను పడే ఆరాటం నాకు తెల్సు. ఆల్లకు జరమొస్తే నాకూ జరమొచ్చినట్లే ఉంటది. అట్లాంటిది ఒక గూడెం పిల్ల ఈ ప్రభుత్వానికీ వీల్ల పధకాలకీ ఏమీ సంబంధం లేని పిల్ల చావు బతుకుల్లో ఉంది. నేనేం చెయ్యాలి.'




  • 'పిల్ల కడుపుల అడ్డం తిరిగింది సారూ. కాన్పు కష్టమయితది. దగ్గర్ల దవాఖాను తీస్కపోకపోతే తల్లీబిడ్డ బతకరు' నా కాళ్లు బట్టుకొని బతిమిలాడిందొకామె.




  • ఏం చేయాలి? రూల్సు అడ్డమొస్తున్నాయి. పానం గుంజుతున్నది. వొచ్చిన పని వేరు. చేస్తున్న పని వేరు.




  • 'చివరకు ఓ నిర్ణయానికొచ్చాను. తక్కిన పోలీసులు వారిస్తున్నా వినకుండా ఆ అమ్మాయిని వ్యానులో దగ్గరున్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు పంపించిన. నాకు రాబోయే ప్రమాదం సంగతి తెలుసు. అయినా నాలోని పోలీసును నాలోని మనిషి జయించిండు'




  • 'ఆమె కాన్పు అయిందా తాతా'




  • 'అయింది. తల్లీ బిడ్డ క్షేమం'




  • 'అయితే ఇక్కడే నా కథలో విషాదం మొదలయింది. సాయంత్రానికి వెళ్ళాల్సిన రిపోర్ట్టు వెళ్ళలేదు. గూడెం మండలేదుగాని ఆఫీసర్లు మండిపోయిన్రు. యింత ధిక్కారమా? ఆఫ్టరాల్‌ ఒక గూడెంపిల్ల కోసం ఆర్డర్స్‌ డిస్‌ ఒబే చేస్తడా? అదీగాక ఆ పిల్లను పోలీసు వ్యానులో దవాఖానకు పంపిస్తడా? వాట్‌ డస్‌ హి థింక్‌ ఆఫ్‌ హిమ్‌సెల్ఫ్‌? సస్పెండ్‌ హిమ్‌. అంతే.'




  • 'ఈ లోపున పెద్ద రగడ జరిగింది. అన్ని పేపర్లల్ల పెద్ద పెద్ద వార్తలొచ్చినయి. పెద్ద పెద్దోల్లు ముక్కున ఏలేసుకున్నరు. ఎట్ల దొర్కిందో ఏమో పేపరోల్లకు పై నుంచి వొచ్చిన ఆర్డరొకటి దొర్కింది. ఫలానా ఫలాన గూడేలను వెంటనే తగులబెట్టమని ఇచ్చిన ఆర్డరు తాటికాయలంత అక్షరాల్తో అచ్చయినాయి. చివరకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ విధంగా 'దుమ్ముగూడెం' ఆ తర్వాత కూడా బుగ్గికాకుండా బయటవడ్డది'




  • 'ఆ తర్వాత?'




  • 'తర్వాత ఏంది? నాకు సస్పెన్షన్‌ ఆర్డర్లు వొచ్చాయి. ఊహించిందేగాబట్టి మౌనంగా ఆర్డర్‌ తీసుకున్నా. గోదావరిల స్నానం జేసిన. నా బిడ్డ సమాధి కాడ కాస్సేపు కూచుని ఏడ్చిన. ఓ సంవత్సరం తర్వాత నా సస్పెన్షన్‌ ఎత్తి వేసిన్రు. కాని నా యింక్రిమెంటు మాత్రం శాశ్వతంగా కట్‌ చేసిన్రు. ఏమయితేం ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడగలిగాను. ఆ తృప్తి చాలు. నాకు యింక్రిమెంటు యాదికొచ్చినప్పుడల్లా ఆ గూడెం పిల్ల ముఖం యాదికొస్తది. గప్పుడు మనసు తేలికయితది'




  • ఎప్పుడూ తాము జోకులేసుకునే తమ తాతలో యింత గొప్ప మనిషి ఉన్నాడా అని ఆశ్చర్యపోయి ముద్దుల్ల్లో ముంచెత్తారు మా పిల్లలు.



  • Search This Blog