inspire person
బాజా మోత... లక్షల దాత...:

మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే...(నీను కుడా వెళ్ళలేదు బట్ వెళ్ళిన నా ఫ్రెండ్ ఒకామె చెప్పినది) మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి) ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.
1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.