Saturday, September 3, 2011

child labour




అనేకానేక సంక్షోభాలు
జీవితాన్ని కుదిపేశాక
బ్రతకటమనేదే ఆఖరి సమస్య
ఎవరికి ఎవరు ఏమీ కానప్పుడు
సొంత రక్తంలో పరాయితనం....

చెత్త కుప్పల మీద పరచుకున్న
శాపగ్రస్త బాల్యం street children
జీవితాన్ని వెతుక్కోవడానికి
సూర్యోదయానికి సలాం కొట్టి
వాళ్ళు బయల్దేరుతారు
భుజం మీద సంచిలో
బ్రతుకు భారాన్ని మోస్తూ

అక్షరాలు దిద్దాల్సిన బాల్యం
చిత్తు కాగితాల్లో చిక్కు పడిపోయింది
పాలు తాగాల్సిన బాల్యం
పాల కవర్ల వేటలో చేజారిపోయింది

ఏ అమావాస్య వాళ్ళను
వీధిపాలు చేసిందో ?
ఎండా...వాన...
ఏ  ఋతువైతేనేం?
పగలు ...రాత్రి ...
సమయంతో  సంబంధమేమీ లేదు
ఎవరున్నారు అడగడానికి

కేవలం బ్రతకడానికి
ఎన్నెన్ని యుద్దాలు చేస్తారు వాళ్ళు
ఎన్నిసార్లు గాయ పడతారో తెలుసా?
చేత్తకుప్పల్లో దొరికే వాటిని తీసి
అపురూపంగా సంచిలో వేసుకునే
వాళ్ళను చూస్తుంటే
పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు
వాళ్ళు నడుస్తుంటే
ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది

Search This Blog