Saturday, February 19, 2011

కవితలు




 మా ఊరు

నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు......... స్నేహమా బ్లాగ్ నుండి 

@@@@@@@@@@@@@@@@@@@@@@
చిలక ప్రశ్న
--------------
ఎలక్కి బోనూ
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zooలూ)
కుక్కలకి గొలుసూ
చేపలకి పులుసూ ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బ సొమ్మా!
పిల్లాడికి జ్వరమొస్తే
కోడిపుంజుకు చవా?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాలా?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా?
పండూ - పిట్టా
రెండూ నీకేనా?
ఏనుగు దంతంతో
బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో
ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం - నీ తపస్సూ!!
(ఈ కవిత బ్లూ క్రాస్ సొసైటీ ... అక్కినేని అమలాగార్కి అంకితం)

Search This Blog