Friday, February 18, 2011

ARTICLES

భారత దేశములో కొన్ని చోట్ల పెళ్ళి కాక మగాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. దానికి ముఖ్య కారణం, స్త్రీ పురుషుల నిష్పత్తిలో తేడాలు. అదీ కూడా Sex ratio తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఇలాంటివి జరుగుతున్నాయి. అంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో మరీ అంతగా యేమీ లేదు.

ఒకమ్మాయి అబ్బాయి అర్హతలను బట్టే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అందం, చదువు, సంపాదనా అన్నీ లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు, సంపాదించడం అన్నది అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ కామన్ అయిపోయింది. సంపాదిస్తున్న అమ్మాయిలకు సెక్యూరిటీ మగాడూ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ అమ్మాయిలు అందం, చదువు, లైఫ్ స్టైల్ చూస్తున్నారు. అంతే. అది కూడా చక్కగా చదువుకుని, ఉధ్యోగాలు చేసే అమ్మాయిల విషయములోనే ఇదంతా వర్తిస్తుంది. అబ్బాయిలు కూడా, కొన్ని రకాలైన గొంతెమ్మ కోర్కెలకు పోకుండా (భారీగా కట్నం, అపురూప సౌందర్య రాసి లాంటివి) క్యాజువల్గా ఉంటే చాలు. పెళ్ళీళ్ళు అవే అవుతాయి. అమ్మాయిలు అబ్బాయిలను కాక గ్రహాంతరవాసులను చేసుకుంటారా యేమిటి?

ఇక, రిజెక్టు చేయడం విషయానికి వస్తే, ఇదివరకూ పెద్దలు చెప్పినట్టు మాత్రమే అమ్మాయిలు వినే వారు. వారికి స్వతంత్రము ఉండేది కాదు. ఇప్పుడు, తల్లిదండ్రులు స్వతంత్రము ఇస్తుండడముతో, వారు తమ కోరికలను బయట పెడుతున్నారు. ఫలితముగా కొంత మంది రిజెక్ట్ అవుతున్నారు. అందులో మరీ అంత ఫీల్ అవ్వాల్సింది యేముంది. మనలో మన మాట, అమ్మాయిలు రిజెక్ట్ చేయకుండా వదిలేసిన మగాడిని ఒక్కడిని చూపించండి చూద్దాం. నేను చెప్పేది పెళ్ళిళ్ళ విషయములో కాదు, బయట పరిచయాలగురించి. యేదో ఒక రోజు, యేదో ఒకమ్మాయితో మనము మాట్లాడాలని ముచ్చట పడడం, వారు మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం ప్రతీ మగాడి జీవితములో జరిగి ఉంటుంది అనేది నా అభిప్రాయం. అప్పుడు మనమేమన్నా ఫీలయ్యామా? మనతో మాట్లాడే వాళ్ళు మనకున్నారులే అని దులుపుకుని పోతాం అంతేనా కాదా?

కొంత మంది, అమ్మాయిలు అబ్బాయిలను రిజెక్టు చేయడం పురుషాధిక్యతకు చెల్లుచీటీగా చూడడం, దానికి ప్రచారం కల్పించడం జరుగుతోంది.(పేపర్లలో,వార్తలూ వ్యాసాలూ ఇప్పటికే చాలా చూసుంటాం మనం). పెళ్ళాం కొట్టినందుకు కాదు, పక్కింటోడు చూసి నవ్వి నందుకని, అమ్మాయిలు రిజెక్టు చేసినదానికన్నా ఇలాంటివి చదివినప్పుడే కొంచెం యెక్కువ కాలడం సహజమే. ఇది స్త్రీపురుషుల మధ్య ఉన్న అంతరాలను రూపుమాపడానికి జేసే యుద్దం తరువాత వచ్చిన సంధి కాలం. సంధిప్రేలాపణలు ఇలానే తగలడతాయి. కాబట్టి, ఇలాంటివి జరిగినప్పుడు ఒక నవ్వు నవ్వి వదిలేయండి. (మీకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం కాదు సుమా..!!)

అబ్బాయిలు చక్కగా చదువు మీద దృష్టిపెట్టి, జీవితములో స్థిరపడడనికి ప్రాధాన్యతను ఇస్తే, మిగిలినవి ఆటోమాటిక్ గా అవే జరుగుతూ పోతాయి. దురదృష్టవశాత్తూ మన అబ్బాయిలలో ఆతెలివి కొరవడింది. శంకర్ తీసిన ఒకే ఒక్కడు సినిమాలోని ఒక పాట గుర్తుందా.. షక లక బేబీ, షకలక బేబీ అని. చక్కగా చెప్పాడు పాటలు రాసినాయన. —-లైఫులో గెలిస్తే..అమ్మాయిలే వచ్చునులే వలచేనులే.. అంటూ.. కాబట్టి మైడియర్ బ్రదర్స్.. డొంట్ కర్రీ.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ జీవితాన్ని ప్రేమించుకోండి, అది చక్కగా సాగిపోవడానికి కృషిచేయండి. మిగిలినవి అవే జరుగుతాయి.

Search This Blog