చిలక ప్రశ్న
--------------
ఎలక్కి బోనూ
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zooలూ)
కుక్కలకి గొలుసూ
చేపలకి పులుసూ ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బ సొమ్మా!
పిల్లాడికి జ్వరమొస్తే
కోడిపుంజుకు చవా?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాలా?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా?
పండూ - పిట్టా
రెండూ నీకేనా?
ఏనుగు దంతంతో
బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో
ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం - నీ తపస్సూ!!
(ఈ కవిత బ్లూ క్రాస్ సొసైటీ ... అక్కినేని అమలాగార్కి అంకితం)