Sunday, October 2, 2011

ఆన్‌లైన్‌లో ఆకాశవాణి

సంగీతం మన జీవితంలో ఒక భాగం. ఇది అందరూ ఒప్పుకునే సత్యం. అది శాస్ర్తియ సంగీతమైనా భక్తి సంగీతమైనా సినిమా పాటలైనా మనసును ఉల్లాసపరుస్తాయి అని ఒప్పుకోక తప్పదు. ఉదయం ఆరు గంటలకే భక్తి సంగీతంతో నిద్ర లేపే రేడియో లేదా ఆకాశవాణి భారతీయులందరికీ సుపరిచితమే. కొనే్నళ్ల క్రింద ఒక చెక్కపెట్టెలో నుండి మాటలు, పాటలు వస్తూంటే వింతగా చూసేవారు కాని నేడది చాలామందికి జీవితంలో ఒక భాగమై పోయింది. ఒక టేబిల్ మీద ఉండే పెద్ద రేడియో పెట్టె నేడు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ద్వారా కోట్లాది మందిని అనుక్షణం వెన్నంటే ఉంటుంది. పాటలు వింటూ పని చేసుకోవడం ఒక వ్యసనంలా మారిందని చెప్పవచ్చు. మధురమైన సంగీతంతో మనసును సేదతీర్చి ఆహ్లాదాన్ని ఇచ్చే మధుర మైన వ్యసనం ఇది. అందుకే ఈనాడు ప్రతీ మొబైల్ ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో తప్ప కుండా ఉంటుంది. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో ఎన్నో ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లు, ఇంటర్నెట్ రేడియోలు పెరిగిపోతున్నాయి అని చెప్పవచ్చు. విస్తృతంగా పెరిగిన అంతర్జాల వినియోగంతో కొందరు ఔత్సాహికులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త రేడియో ఛానళ్లు మొదలుపెడుతున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా మొబైల్ ద్వారా పాటలు వింటున్నారు చాలామంది. ఈ ఎఫ్‌ఎం రేడియోలు మన దేశంలోనే అందుబాటులో ఉన్నాయి కాని విశ్వవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులైన తెలుగువారు తమ కంప్యూటర్ ద్వారా వివిధ రేడియోల ద్వారా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది.
దేవరాగం విత్ భారతి, నేను ప్రతీక, ముద్దుగా గుడ్‌మార్నింగ్ చెప్పే సునయన, క్రిష్, ఫాహద్, బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్.. వీళ్లందరూ నాయకులు కారు, సినీ ప్రముఖులు కారు ఐనా ఈనాడు ఎంతోమందికి పరిచయం. రోజూ వీరి మాటను అందరూ వింటున్నారు. ఆనందిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు. ఎవరు వీళ్లు? తెలుగు ఎఫ్‌ఎం ఛానెల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ తమ మాటలతో, మధురమైన పాత కొత్త పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందుకే రోజురోజుకు రేడియో వినియోగం పెరిగిపోతోందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు చిన్నచిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా రేడియో ద్వారా మంచి పాటలను వినిపిస్తున్నారు. మరి హైదరాబాద్‌లో మాత్రమే వినగలిగే తెలుగు ఎఫ్‌ఎం ఛానెళ్లు రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్‌ఎం, రెయిన్‌బో ఎఫ్‌ఎం, వివిధభారతి మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఇక్కడ http:// www.voicevibes.net/ / వినొచ్చు. కానీ ఖర్చు లేదు. సభ్యత్వం తీసుకునే పని లేదు. ఇదేకాక తెలుగు పాటలు వినిపించే రేడియో ప్లేయర్లు లభించే సైట్లు కూడా బోలెడన్ని ఉన్నాయి.
తెలుగు వన్ వారు నిర్వహిస్తున్న http:// www.toucheradio.com/ లో అమెరికా, లండన్, ఇండియా, ఆస్ట్రేలియా సమయాల కనుగుణంగా రేడియో ఏర్పాటు చేయబడింది. ఇందులో ‘లైవ్ రేడియో’ కూడా ఉంది. అలాగే ToRi లో రేడియో పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇళయరాజా పాత పాటలు, కొత్త పాటలు మొదలైన పేర్లతో ఇతర ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నారు. ఈ మధ్యే మొదలైన మరో రేడియో మనసుతో (manasutho.com) .. ఈ రేడియోలో మధురమైన పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉంటారు అంతేకాక యుగళ గీతాలు, సోలో గీతాలు, ప్రేమగీతాలు అంటూ వివిధ విభాగాలు కూడా పొందుపరిచారు నిర్వాహకులు. మరో తెలుగు రేడియో (ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో మాత్రమే పని చేస్తుంది http:// livetvchann elsfree.in/teluguradio.htm ఇక్కఢ తెలుగుతోబాటు మరి కొన్ని భారతీయ భాషలలోని పాటలు వినే అవకాశం ఉంది. నెటిజనులలో బాగా ప్రాచుర్యం పొందిన మరో రేడియో http:// www.radiokhushi.com/ ఇందులో తెలుగు, హిందీ భాషలలో రేడియోలు ఉన్నాయి. తెలుగు విభాగంలో మీరు కోరిన పాటలు, హిట్ పాటలు, భక్తి సంగీతం, అభినందనలు మొదలైన వర్గాలుగా పాటలను అందిస్తున్నారు. తెలుగు పాటలను అందించే మరో రేడియో http:// www.telugufms.com/ ఇందులో రేడియో మాత్రమే కాక ప్రముఖ సంగీత దర్శకుల పాటలు కూడా అందిస్తున్నారు. ఇందులో ఇరవైకి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. మరో కొత్త రేడియో ఛానెల్ http:// radiojosh.com/ ఇందులో తెలుగు హిందీ పాటలు వినొచ్చు. ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాల అనుసంధానంతో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా.. అంతేకాకుండా రాగా, చిమట మ్యూజిక్ సైట్లలో కూడా తెలుగు పాటల ప్లేయర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంప్యూటర్ తెరిచేసి హాయిగా తెలుగు పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు చేసుకోండి.... akulaa raghavendra

Search This Blog